భరత్‌ మృతి: విమర్శలపై స్పందించిన రవితేజ

Ravi teja brother death

రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన భరత్‌ను కడసారి చూడలేకనే.. అతని అంత్యక్రియలకు తానుగానీ, తన తల్లిగానీ వెళ్లలేదని హీరో రవితేజ తెలిపారు. తమ్ముడు భరత్‌ మరణం తర్వాత తొలిసారి ఆయన బుధవారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. భరత్‌ మరణం గురించి తెలిసిన వెంటనే తమ కుటుంబసభ్యులు తీవ్రంగా ఆవేదన చెంది కుప్పకూలారని తెలిపారు.

భరత్‌ అంత్యక్రియలకు తాము హాజరుకాని విషయంలో సోషల్‌ మీడియాలో, కొన్ని చానెళ్లలో వచ్చిన కథనాలు సరికావని, అవి అసత్య ప్రచారాలని చెప్పారు. భరత్‌ అంత్యక్రియలను జూనియర్‌ అర్టిస్టుతో జరిపించారన్న కథనాలు అసత్యమన్నారు. తన చిన్నాన్న, సోదరుడు భరత్‌ అంత్యక్రియలు నిర్వహించారని తెలిపారు.

నెక్ట్స్‌ డే షూటింగ్‌కు వెళ్లాను!
భరత్‌ మృతి చెందిన తెల్లారే తాను షూటింగ్‌కు వెళ్లానంటూ వచ్చిన కథనాలపై హీరో రవితేజ స్పందిస్తూ.. తెల్లారే షూటింగ్‌కు వెళ్లలేనది, నెక్ట్స్‌ డే వెళ్లానని వివరణ ఇచ్చారు. పాతికమంది ఆర్టిస్టుల కాంబినేషన్‌ ఉంటుందని, అందుకే తాను షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. ఈ షూటింగ్‌లో నవ్వుతూ సెల్ఫీలు దిగారన్న కథనాలను తోసిపుచ్చారు. తమ కుటుంబం గురించి రాస్తున్న ఇలాంటి కథనాలు ఆవేదనకు గురిచేస్తున్నాయని చెప్పారు. సోషల్‌ మీడియాలో తమ కుటుంబం గురించి పరిధిని అతిక్రమించి రాస్తున్నారని అన్నారు. దయచేసి ఇలాంటి కథనాలు రాయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here