తెలంగాణను ఆశీర్వదించండి – రామ్‌నాథ్ కోవింద్‌ కు కెసిఆర్ విజ్ఞప్తి

సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రంగా ఏర్ప డి, అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను ఆశీర్వదించాలని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌ను టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు. రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వానికి తమ పార్టీ సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నదని పునరుద్ఘాటించారు.

కోవింద్ భారీ మెజారిటీతో గెలువడం తథ్యమని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం హైదరాబాద్ వచ్చిన రామ్‌నాథ్ కోవింద్.. నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినప్పుడు మొట్టమొదటి మద్దతు ప్రకటన చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరేనని గుర్తుచేశారు.

నామినేషన్ సమయంలోనూ మద్దతు తెలిపేందుకు కేసీఆర్ హాజరుకావడం సం తోషం. అందరికీ నా ధన్యవాదాలు. రాష్ట్రపతి పదవిని సమర్థంగా నిర్వహిస్తా. నా అభ్యర్థిత్వానికి మద్దతివ్వండి అని కోవింద్ కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ దేశ అత్యున్నత పదవికి రామ్‌నాథ్ కోవింద్ పేరును టీఆర్‌ఎస్ తరఫున సమర్థించడం గర్వంగా ఉందన్నారు. మీ అనుభవం, కార్యదీక్షతో రాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. భారత గణతంత్ర ప్రజాస్వామ్య విలువలను పెంచుతారని ఆశిస్తున్నాం.

kcr
భారత్‌ను ఆర్థికవృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ ఆచరిస్తున్న విధానాలకు.. సమాఖ్య స్ఫూర్తిని కనబరుస్తూ టీఆర్‌ఎస్ సహకరిస్తున్నది. రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారనడంలో సందేహం లేదు. టీఆర్‌ఎస్ తరఫున మరోసారి మద్దతు తెలియజేస్తున్నాం. భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రగతికి మీ ఆశీర్వాదం, మార్గదర్శకత్వం కోరుకుంటున్నాం. రాష్ట్రపతిగా మీకు విజయం కలుగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని కేసీఆర్ చెప్పారు.

సుదీర్ఘ పోరాటం తరువాత ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. జూన్ 2, 2014 నాడు తెలంగాణ ఏర్పడ్డప్పుడు మా ముందు ఎన్నో సమస్యలున్నాయి. విద్యుత్ కొరత పెద్ద సమస్యగా ఉండేది. ప్రతి రోజూ విద్యుత్ కోతలుండేవి. కానీ ఈ సమస్యను పరిష్కరించుకున్నాం. అంతేకాదు తెలంగాణ ఇప్పుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అని కేసీఆర్ అన్నారు. చాలా తక్కువ సమయంలోనే భారత్‌లోని అగ్రశ్రేణి రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణను నిలిపామని తెలిపారు. 17.8% వార్షిక ఆదాయం వృద్ధి రేటుతో భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ కొనసాగుతున్నది.

సంక్షేమంలోనూ భారత్‌లోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం 38లక్షల మందికి నెలనెలా రూ.1000 చొప్పున పింఛను ఇస్తున్నది. ఇతర పథకాలద్వారా పేద ప్రజల సంక్షేమంకోసం కృషిచేస్తున్నాం. ఎస్టీ, ఎస్సీల అభివృద్ధికి ఈ ఏడాది రూ.22,400 కోట్లతో ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ రూపొందించి, దాని అమలుకు కొత్త చట్టం తెచ్చాం. పేదలకు నివాసం కోసం ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నాం. దీనిద్వారా సమాజంలో పేదల గౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ పారిశ్రామికవృద్ధి కోసం.. పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేలా నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్ తీసుకువచ్చామని చెప్పారు. దీనిద్వారా ఇప్పటికే 4026 దరఖాస్తులను పరిశీలించి అనుమతులు ఇచ్చామన్నారు. ఈ విధానాన్ని ప్రపంచంలోని పలు దేశాలు కీర్తించాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత రెండేండ్లుగా తెలంగాణ రాష్ట్రం భారత ప్రభుత్వం నుంచి మొదటి ర్యాంకు అందుకున్నదని గుర్తుచేశారు.

kcr1


రాజకీయాలకు అతీతంగా పనిచేస్తా: కోవింద్

రాష్ట్రపతి పదవికున్న గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుతానని ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వర్తిస్తానని స్పష్టంచేశారు. బీజేపీతో తనకున్న రాజకీయ అనుబంధం గతమని, ఇప్పుడు తాను ఏ పార్టీకీ చెందిన వ్యక్తిని కాదని తెలిపారు. బీహార్‌కు గవర్నర్ కాకముందే బీజేపీ సభ్యత్వాన్ని వదులుకున్నానని వెల్లడించారు.

బీహార్ గవర్నర్‌గా రాజకీయాలకతీతంగా రాజ్యాంగపర విధులు నిర్వర్తించానని, రాష్ట్రపతి బాధ్యతలు కూడా అదే రీతిలో నిర్వహిస్తానని ప్రకటించారు. తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీఆర్‌ఎస్‌కు, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కోవింద్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నేను రెండు విషయాల్లో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటి నా గౌరవార్థం హైదరాబాద్ నగరంలో స్వాగత హోర్డింగులు ఏర్పాటుచేశారు. నాకు మరో గౌరవం ఇచ్చారు. హిందీ రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చానని కేసీఆర్‌కు తెలుసు కాబట్టి.. ఆయన నా కోసం హిందీలో ప్రసంగించారు అని చెప్తూ సంతోషం వ్యక్తంచేశారు. మనది ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. రాష్ట్రపతి పదవి ఈ ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనది.

kcr2
డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్ వెంకట్రామన్, ఏపీజే అబ్దుల్ కలాం, హైదరాబాద్‌కు చెందిన జాకీర్ హుస్సేన్, ఉమ్మడి ఏపీకి చెందిన నీలం సంజీవరెడ్డి.. వీళ్లంతా రాష్ట్రపతి పదవికి వన్నెతెచ్చారు అని కోవింద్ పేర్కొన్నారు. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పారు. కులం, భాష, ప్రాంతీయ, భౌగోళిక పరిస్థితులకు అతీతంగా.. అన్ని రంగాల్లోనూ దేశ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తానని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు స్వాగతం పలుకగా, టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి వందన సమర్పణ చేశారు. కోవింద్‌ను కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు సభకు పరిచయంచేశారు. కోవింద్‌కు కేసీఆర్ శాలువ కప్పి, మెమొంటో ఇచ్చి ఘనంగా సన్మానించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, ఇతర అతిథులు వేదికపై ఆసీనులయ్యారు. రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు హాజరయ్యారు.
kcr3

కేసీఆర్ మద్దతు ప్రత్యేకం

దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారు.. సీఎంకు వెంకయ్య ప్రశంస
రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు మద్దతు పలికిన తీరు ప్రత్యేకంగా నిలిచిందని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అభినందించారు. టీఆర్‌ఎస్ ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కాకపోయినప్పటికీ దేశ ప్రయోజనాల కోణంలో మద్దతునివ్వాలని అందరికన్నా ముందుగానే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. గతంలో పెద్దనోట్ల రద్దు అంశంలో..అలాగే జీఎస్టీ విషయంలో కూడా కేసీఆర్ దేశప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారన్నారు. పెద్దనోట్ల రద్దుతో మోదీ ప్రభుత్వం సరైన దిశలో వెళుతుందని గుర్తించి మొదటగా మద్దతునిచ్చింది కేసీఆరేనని, అలాగే జీఎస్టీ అంశంలో కూడా అసెంబ్లీ తీర్మానం ద్వారా సత్వరమే ముం దుకు కదిలారని చెప్పారు. జీఎస్టీ అమలు విషయంలో ముఖ్యమంత్రులతో మాట్లాడాల్సిందిగా ప్రధాని మోదీ తనకు చెప్పారని, అయితే ఈలోగానే సీఎం కేసీఆర్ జీఎస్టీపై సందేహాలను నివృత్తి చేసేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయం కూడా తీసుకున్నారని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ ఎల్లవేళలా ఆదర్శవంతమైన సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారని వెంకయ్య చెప్పారు. రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా మంగళవారం జలవిహార్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. తమ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఆత్మీయ, ప్రత్యేక కార్యక్రమం విభిన్నంగా ఉందని అన్నారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో వివిధ పార్టీలు తర్జనభర్జనలు పడుతున్న సమయంలోనే దేశ అభివృద్ధి కోణంలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించినందుకు భారతీయ జనతాపార్టీ తరఫున, ఎన్డీఏ పక్షాల తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ పార్టీకి అభినందనలు తెలియచేస్తున్నానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here