శిథిలాల నుంచి 400 కేజీల బంగారం వెలికితీత

gold

అగ్ని ప్రమాదంలో కుప్పకూలిన ఓ షాపింగ్ మాల్ శిథిలాల నుంచి 400 కేజీల బంగారు ఆభరణాలను వెలికి తీశారు. ఇనుప పెట్టెల్లో దాచి ఉంచిన ఈ బంగారాన్ని భద్రంగా బయటికి తెచ్చి సంబంధిత యాజమాన్యానికి అప్పగించారు. చెన్నై టి.నగర్‌లోని చెన్నై శిల్క్స్ భవనంలో మే 31వ తేదీన భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రెండు రోజులపాటు మంటలు అదుపులోకి రాలేదు. ఆ సమయంలో భవనంలోని కొన్ని అంతస్తులు కూలిపోయాయి. ప్రమాదకర పరిస్థితులో ఉన్న కొన్ని అంతస్తులను అధికారులు కూల్చేశారు.

అయితే శిథిలాల కింద లాకర్లలో 400 కిలోల బంగారు ఆభరణాలు, వజ్రాలు, వెండి ఆభరణాలు ఉన్నట్లు అప్పుడు చెన్నై శిల్స్క్ యాజమాన్యం పోలీసులకు వెల్లడించింది. సుమారు 43 రోజుల అనంతరం బుధవారం (జులై 12)న ఆ ఆభరణాలను అధికారులు బయటికి వెలికి తీశారు. మరో లాకర్‌లో భద్రపరిచిన వజ్రాలు, వెండి నగలను తీసే పనిలో ప్రస్తుతం సిబ్బంది నిమగ్నమయ్యారు. వాస్తవానికి భవనంలోని ఆరో అంతస్తులో ఒక లాకర్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రెండు లాకర్లు ఉన్నట్లు యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.

భవనం కూలగొట్టే సమయంలో ఆరో అంతస్తులోని లాకర్‌ శిథిలాల్లో పడిపోయింది. దాన్ని గత నెల 22వ తేదీన బయటకు తీశారు. అందులో ముఖ్యమైన దస్తావేజులు మాత్రమే ఉన్నాయి. శిథిలాల్లో కూరుకుపోయిన గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని రెండు లాకర్లను బయటకు తీయడం కష్టతరంగా మారింది. లాకర్లను తీయలేమని భావించిన సిబ్బంది.. వాటిల్లోని నగలను మాత్రమే తీసేందుకు ప్రయత్నించారు. అలా దాదాపు 400 కేజీల బంగారు ఆభరణాలను వెలికి తీసి సుమారు 20 నుంచి 25 ఇనుప పెట్టెల్లో భద్రంగా బయటకు తీసుకువచ్చారు. రెండో లాకరులోని వజ్రాలు, వెండి నగలను బయటకు తీసేందుకు మరో మూడు రోజులు పడుతుందని అధికారులు చెప్పారు.
Source: Samayam

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here